||సుందరకాండ ||

|| నాలుగొవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 4 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుర్థః సర్గః

శ్లో|| స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లఙ్కాం తాం కామరూపిణీ|
విక్రమేణ మహాతేజా హనుమాన్ కపిసత్తమః||1||
అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే |

స|| కపిసత్తమః మహాబాహుః హనుమాన్ తాం లఙ్కాం కామరూపిణీం విక్రమేణ నిర్జిత్య సః అద్వారేణ శ్రేష్ఠాం పురీం ప్రాకారమభిపుప్లువే ||

తా|| ఆ కపిసత్తముడు మహాబాహువు అగు హనుమంతుడు కామరూపిణీ అగు లంకిణిని తన పరాక్రమముతో జయించి శ్రేష్ఠమైన నగరమును ద్వారములేని చోటనుంచిప్రవేశించెను.

శ్లో|| ప్రవిశ్య నగరీం లఙ్కాం కపిరాజహితంకరః||2||
చక్రేఽథ పాదం సవ్యం చ శత్రూణాం స తు మూర్థని|

స|| కపిరాజహితం కరః నగరీం లఙ్కాం ప్రవిశ్య సః శత్రూణాం మూర్ధని సవ్యం పాదం చక్రే తు||

తా|| కపిరాజుహితము కోరు ఆ హనుమంతుడు తన ఎడమపాదమును శత్రువుతలపై పెట్టినట్లు లంకానగరము లో ( ఎడమపాదము ముందు) పెట్టి ప్రవేశించెను.

శ్లో|| ప్రవిష్ఠ సత్వ సంపన్నో నిశాయాం మారుతాత్మజః||3||
స మహాపథమాస్థాయ ముక్తపుష్ప విరాజితమ్|
తతస్తు తాం పురీం లఙ్కాం రమ్యాం అభియయౌ కపిః||4||

స|| సత్త్వసంపన్నః సః మారుతాత్మజః నిశాయామ్ ముక్తాపుష్పవిరాజితం మహాపథమ్ ఆస్థాయ ప్రవిష్ఠః|| తతః తాం రమ్యాం నగరీం లఙ్కాం అభియయౌ||

తా|| ఆ విధముగా ఆ రాత్రి , బలిష్ఠుడైన ఆ మారుతాత్మజుడు ముత్యములతో పుష్పములతో విరాజిల్లు మహామార్గములలో ప్రవేశించెను.

శ్లో|| హసితోత్కృష్ణనినదై స్తూర్యఘోషపురస్సరైః|
వజ్రాంకుశనికాశైశ్చ వజ్రజాలవిభూషితైః||5||
గృహమేఘైః పురీ రమ్యా బభాసే ద్యౌ రివాంబుధైః|

స|| హసితోత్కృష్ట నినదైః తూర్యఘోషపురః సరైః వజ్రాంకుశనికాశైశ్చ వజ్రజాల విభూషితైః మేఘాఇవ గృహైః రమ్యా పురీ అమ్బుదైః ద్యౌః ఇవ బభాసే||

తా|| నవ్వులసందడితో, వాద్యఘోషలతో నిండిన, వజ్రములతో అలంకరింపబడిన గవాక్షములు గల మేఘములను అందుకుంటున్న గృహములతో నున్న ఆ లంకానగరము మేఘములతో ఉన్న ఆకాశములాగ ప్రకాశించెను.

శ్లో|| ప్రజజ్వాల తదా లఙ్కా రక్షోగణగృహై శ్శుభైః||6||
సితాభ్రసదృశైశ్చిత్రైః పద్మస్వస్తికసంస్థితైః|
వర్థమాన గృహైశ్చాపి సర్వత స్సువిభూషితా||7||

స|| తతః సితాభ్రసదృశైః శుభైః చిత్రైః పద్మస్వస్థిక సంస్థితైః రాక్షస గణ గృహైః వర్ధమాన గృహైశ్చాపి సర్వతః లఙ్కా సువిభూషితా||

తా|| ( ఆ లంకానగరము) తెల్లని మేఘములతో సమానమైన గృహములతో, శుభకరమైన పద్మాకారము స్వస్తికాకారము గల రాక్షస గణముల గృహములతో, అన్నిచోటలా వర్ధిల్లగల భవనములతో భూషితమై యున్నది.

శ్లో|| తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః|
రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శచ ననంద చ ||8||

స|| కపిరాజహితం కరః శ్రీమాన్ చిత్రమాల్యాభరణామ్ తాం (పురీమ్) రాఘవార్థమ్ చరన్ దదర్శచ ననంద చ||

తా|| ఆ కపిరాజు హితము కోరువాడు ( అగు హనుమంతుడు) రాఘవుని కార్యము చేయుటకై తిరుగుచూ ఆ నగరము చూచి ఆనంద పడెను.

శ్లో|| భవనాద్భవనం గచ్ఛన్ దదర్శ పవనాత్మజః|
వివిధాకృతిరూపాణి భవనాని తతస్తతః||9||

స|| భవనాత్ భవనం గచ్ఛన్ పవనాత్మజః తతః తతః వివిధాకృతి రూపాణి భవనాని దదర్శ||

తా|| ఒక భవనమునుంచి ఇంకో భవనము వెళ్ళుతూ ఆ పవనాత్మజుడు వివిధాకృతిగల భవనములను చూచెను.

శ్లో|| శుశ్రావ మథురం గీతం త్రిస్థానస్వరభూషితమ్ |
స్త్రీణాం మదసమృద్ధానాం దివిచాప్సరసామివ ||10||

స|| (సః) దివి అప్సరసామివ మదసమృద్ధానామ్ స్త్రీణామ్ త్రిస్థాన స్వరభూషితాం మధురం గీతమ్ శుశ్రావ||

తా|| దేవలోకములోని అప్సరసలవలె ఆ నగర స్త్రీలు మూడు స్థానములుగల స్వరములతో మధురముగా పాడుతున్న పాటలు విన్నాడు.

శ్లో|| శుశ్రావ కాఞ్చీనినదం నూపురాణాం చ నిస్స్వనమ్|
సోపాననినదాంశ్చైవ భవనేషు మహాత్మనామ్ ||11||
అస్ఫోటితనినాదాంశ్చ క్ష్వేళితాంశ్చ తతస్తతః|

స|| (సః) మహాత్మనామ్ భవనేషు కాంచీనినదమ్ నూపురాణాం నిస్స్వనమ్ సోపాననినదాంశ్చైవ అస్ఫోటితనినాదాంశ్చ తతః తతః క్ష్వేళితాంశ్చ శుశ్రావ||

తా|| మహాత్ముల భవనములనుంచి కాలికి కట్టిన గజ్జెలసందడి, నడుముకట్టిన గజ్జెల సందడి, అక్కడక్కడ సోపానములమీద పాదముల సవ్వడి, తప్పట్ల ధ్వని, అక్కడక్కడ సింహనాదములు విన్నాడు.

శ్లో|| శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షోగృహేషువై||12||
స్వాధ్యాయనిరతాంశ్చైవ యాతుధానాన్ దదర్శ సః|
రావణ స్తవసంయుక్తాన్ గర్జతో రాక్షసానపి||13||

స|| (సః) తత్ర రక్షోగృహేషు జపతాం మంత్రాన్ శుశ్రావ ||స్వాధ్యాయనిరతాం యాతుధానాన్ చ రావణస్తవ సంయుక్తాన్ గర్జతః రాక్షసాన్ అపి దదర్శ ||

తా|| అక్కడ రాక్షసుల గృహములనుంచి జపించబడుచున్న మంత్రములను కూడా విన్నాడు. తమంతట తామే వేదాధ్యయనము చేయుచున్న రాక్షసులను చూచెను. అలాగే రావణస్తవము చేయుచూ గర్జించుచున్న వారిని కూడా చూచెను.

శ్లో|| రాజమార్గం సమావృత్య స్థితం రక్షో బలం మహత్|
దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్బహూన్||14||

స|| (సః) మధ్యమే గుల్మే రాజమార్గం సమావృత్య స్థితం మహత్ రక్షోబలం రావణస్య బహూన్ చరాన్ దదర్శ||

తా|| నగరమధ్యములో రాజమార్గముల మీద మహత్తరమైన రాక్షసుల సైన్యమును , అనేకమంది రావణుని గూఢచారులను కూడా చూచెను.

శ్లో|| దీక్షితాన్ జటిలాన్ ముణ్డాన్ గోఽజినాంబరవాససః|
దర్భముష్టిప్రహరణాన్ అగ్నికుణ్డాయుధాన్ స్తథా||15||

స|| (సః) దీక్షితాన్ జటిలాన్ ముణ్డాన్ గోజీనామ్బరవాససః దర్భముష్టిప్రహారణాన్ తథా అగ్నికుణ్డాయుధాన్ తథా ( దదర్శ)||

తా|| దీక్షలో నున్నవారిని, జటాజూటధారులను, గోజీనాంబరము వేసికొని , ధర్భలు చేతులో వుంచుకొనిన, యజ్ఞయాగాదులకు కావలసిన పాత్రలు తీసుకుపోవుచున్న బ్రాహ్మణులను చూచెను.

శ్లో|| కూటముద్గరపాణీంశ్చ దణ్డాయుధధరానపి|
ఏకాక్షాన్ ఏకకర్ణాంశ్చ లంబోదరపయోధరాన్||16||

స|| (సః) కూటముద్గరపాణీం చ దండాయుధధరాన్ (రాక్షసాన్) అపి , ఏకాక్షాన్ ఏక కర్ణాం చ లంబోధరాన్ పయోధరాన్ (దదర్శ)||

తా|| చేతిలో ఇనుపగుదియ ఉన్నవారిని, అలాగే దండాయుధము కలవారిని , ఒకే కన్ను ఉన్నవారిని,ఒకే చెవి వున్నవారిని, పెద్దపొట్టగలవారినీ, పెద్ద స్తనములు గలవారినీ చూచెను.

శ్లో|| కరాళాన్ భుగ్నవక్త్రాంచ వికటాన్ వామనాంస్తథా|
ధన్వినః ఖడ్గినశ్చైవ శతఘ్నీ ముసలాయుధాన్||17||

స|| (సః) కరాళాన్ భుఘ్నవక్త్రాం చ వికటాన్ తథా వామనాన్ చ ధన్వినః ఖడ్గినః చ శతఘ్నీ ముసలాయుధాన్ చ (దదర్శ)

తా|| వికృతరూపముతో భయంకరమైన ముఖము గలవారిని, వామనులను, చూచెను. ఖడ్గము ధరించిన వారిని, ధనస్సు, ముసలాయుధములను ధరించిన వారినీ కూడా చూచెను.

శ్లో|| పరిఘోత్తమహస్తాంశ్చ విచిత్ర కవచోజ్జ్వలాన్|
నాతిస్థూలాన్ నాతికృశాన్ నాతిదీర్ఘాతిహ్రస్వకాన్||18||

స|| (సః) పరిఘోత్తమహస్తాం చ విచిత్రకవచోజ్జ్వలాన్ న అతిస్థూలాన్ న అతికృశాన్ న అతిదీర్ఘా న అతిహ్రస్వకాన్ (దదర్శ)||

తా|| పరిఘలు లాగ వున్న చేతులు గలవారిని , విచిత్రమైనకవచములు ధరించినవారిని , మరీ స్థూలము కాకుండా మరీ సన్నముగా కాకుండా మరీ పొడుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా ఉన్నవారిని చూచెను.

శ్లో|| నాతిగౌరాన్ నాతికృష్ణాన్ నాతికుబ్జాన్న వామనాన్|
విరూపాన్ బహురూపాంశ్చ సురూపాంశ్చ సువర్చసః||19||
ధ్వజీన్ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్

స|| (సః) న అతిగౌరాన్ న అతి కృష్ణాన్ న అతికుబ్జాన్ న వామనాన్ బహురూపాం చ సురూపాం చ సువర్చసః ధ్వజీన్ పతాకినశ్చ వివిధాయుధాన్ దదర్శ||

తా|| మరీ తెల్లగా కాకుండా మరీ నల్లగా కాకుండా మరీ కుబ్జారూపములో లేని వారిని, వామనులను. బహువిధములుగా విరూపము గలవారిని , సుందరరూపము గలవారిని మంఛి వర్ఛస్సు గలవారిని, ధ్వజములు పతాకములు పట్టుకున్నవారిని అనేక రకములైన ఆయుధములు ధరించిన వారిని చూచెను.

శ్లో|| శక్తివృక్షాయుధాంశ్చైవ పట్టిసాశనిధారిణః||20||
క్షేపణీపాశహస్తాంశ్చ దదర్శ స మహాకపిః|
స్రగ్విణస్త్వనులిప్తాంశ్చ వరాభరణ భూషితాన్||21||

స|| సః మహాకపిః శక్తివృక్షాయుధాశ్చైవ పట్టిసాశనిధారిణః క్షేపణీ హస్తాంచ స్రగ్విణస్త్వనులిప్తాంచ వరాభరణ భూషితాన్ దదర్శ||

తా|| ఆ మహాకపి శక్తివృక్షములు ఆయుధముగా ధరించినవారిని, పట్టిశములు అశనములను పదునైన శూలములను, పాశములను చేతిలో ధరించినవారిని చూచెను. సుగంధ ద్రవ్యములను రాసుకున్నవారిని, మంచి ఆభరణములు ధరించినవారిని కూడా చూచెను.

శ్లో|| నానావేష సమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్ |
తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రిణస్య మహాబలాన్||22||

స|| (సః) నానావేషసమాయుక్తాన్ స్వైరగతాన్ యథా బహూన్ తీక్ష్ణశూలధరాం చ వజ్రిణస్య మహాబలాన్ (దదర్శ)||

తా|| అనేక రకములైన వేషములు ధరించినవారిని, తమ స్వేచ్ఛానుసారము తిరుగుచున్నవారిని అలాగే తీక్ష్ణమైన శూలములు పట్టుకోని , వజ్రాయుధము పట్టుకొని తిరుగుచున్న మహాబలులను చూచెను.

శ్లో|| శతసాహస్ర మవ్యగ్ర మారక్షం మధ్యమం కపిః|
రక్షోధిపతినిర్ధిష్ఠం దదర్శాంతఃపురాగ్రతః ||23||

స|| కపిః అన్తఃపుర అగ్రతః రక్షోధిపతినిర్దిష్టం శతసాహస్రం అవ్యగ్రం మధ్యమం ఆరక్షం దదర్శ||

తా|| ఆ కపివరుడు అంతఃపురము ముందు రాక్షసాధిపతిచే ఆజ్ఞాపింపబడి వందలవేల అప్రమత్తమైన రక్షకులను చూచెను.

శ్లో|| స తదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణమ్|
రాక్షసేంద్రస్య విఖ్యాతమద్రి మూర్ధ్ని ప్రతిష్టితమ్||24||
పుండరీకావతంసాభిః పరిఘాభిరలంకృతమ్|
ప్రాకారావృత మత్యంతం దదర్శ స మహాకపిః||25||

స|| సః మహాకపిఃమహాహాటకతోరణం అద్రిమూర్ధ్ని ప్రతిష్టితం విఖ్యాతం పుణ్డరీకావతంసాభిః పరిఖాభిః అలంకృతామ్ ప్రాకారావృతాం రాక్షసేంద్రస్య తత్ గృహమ్ తదా దృష్ట్వా అత్యన్తం దదర్శ||

తా|| ఆ మహాకపి బంగారుమయమైన ముఖద్వారము గల , పర్వతశిఖరముపైనున్నప్రతిష్టించబడిన , తామరపూవులతో కూడియున్నతటాకములతో చుట్టబడిన ప్రాకారములతో నున్న రాక్షసాధిపతి భవనమును చూచెను.

శ్లో|| త్రివిష్ఠపనిభం దివ్యం దివ్యనాద వివినాదితమ్|
వాజిఘోషితసంఘుష్టం నాదితంభూషణైస్తథా||26||
రథైర్యానైర్విమానైశ్చ తథా హయగజై శ్శుభైః|
వారణైశ్చ చతుర్దంతై శ్శ్వేతాభ్రనిచయోపమైః ||27||
భూషితం రుచిర ద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః|
రక్షితం సుమహావీర్యై ర్యాతుధానై స్సహస్రశః||
రాక్షసాధిపతేర్గుప్త మావివేశ మహాకపిః||28||

స|| మహాకపిః దివ్యం త్రివిష్టపనిభం వాజిహేష్టితసంఘుష్టమ్ తథా భూషణైః నాదితం రథైః యానైః విమానైశ్చ శుభైః హయగజైః శ్వేతాభ్రనిచయోపమైః చతుర్థన్తైః వారణైశ్చ భూషితం మత్తైః మృగపక్షిభిః రుచిరద్వారమ్ సుమహావీర్యైః సహస్రశః యాతుధానైః రాక్షసాధిపతేః గుప్తం ఆవివేశ||

తా|| దివ్యమైన స్వర్గములావున్న, దివ్యమైన నాద నినాదములతో మ్రోగుచున్న,గుఱ్ఱపు సంకిళ్ళతో నిండిన, ఆభరణపు సవ్వడులతో నున్న,రధములు వాహనములు విమానములతో అలాగే శుభకరమైన గుఱ్ఱములు ఏనుగులు తో నిండిన, తెల్లని మేఘసముదాయము వంటి నాలుగుదంతములు కల ఏనుగులతో అలంకరింపబడినట్టి , మత్తెక్కిన మృగములు పక్షులతో అలంకరింపబడిన ముఖద్వారములు గల , వేలకొలది రాక్షస రక్షకులచే రక్షింపబడుచున్న రాక్షసాధిపతి గృహమును ఆ మహాకపి ప్రవేశించెను.

శ్లో|| సహేమజాంబూనదచక్రవాళమ్
మహార్హముక్తామణిభూషితాంతమ్|
పరార్థ్యకాలాగరుచందనాక్తమ్
స రావణాంతఃపురమ్ ఆవివేశ||29||

స||సః సహేమ జామ్బూనద చక్రవాళమ్ మహార్హమణిభూషితాంతమ్ పరార్థ్యకాలాగరుచన్దనాక్తమ్ రావణాంతః పురం ఆవివేశ||

తా|| ఆ హనుమంతుడు చుట్టూ బంగారుమయమైన , విలువలేని మణులతో అలంకరింపబడిన చాలామంచి అగరు చందనముల పూయబడిన రావణ అంతః పురమును ప్రవేశించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుర్థస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి విరచిత రామాయణములో సుందరకాండలోని నాలుగవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||